పుట:మధుర గీతికలు.pdf/723

ఈ పుట ఆమోదించబడ్డది

నశించుటకు బదులు మరల మరల ననలు గొనలు సాగి రేకెత్తి శాఖోపశాఖలై విజృంభించునని కొందఱు భావించిరి. అట్లు గాదు, మూలమట్టముగా దీనిని పెల్ల గించినచో, నొక్క సారిగ అంతరించునని మఱికొంద రూహించిరి.

గాంధిమహాత్ముఁడు లోకోత్తరపురుషు డనియు అవతార మూర్తి యనియు భారతీయులే గాక ఖండఖండాంతరులును సంభావించుటచే నాతని బంధించినచోఁ బ్రపంచమందలి సమస్తజాతుల ఖండనలకుఁ బాల్పడుటయకాక మహోపద్రవము లుప్పతిల్లుననియు, సత్త్యమూర్తియు శాంతిదూతయు నగు మహాత్ముని బంధించినచో, ప్రభుత్వదౌష్ట్యము దుస్సహ మగుటచే, మహాత్ముని త త్త్వ మెఱుంగని ప్రజాసామాన్యము దౌర్జన్యమునకుఁ జొచ్చుననియు, అందువలన మహావిప్లవస్థితి యేర్పడి తమ ప్రభుత్వమునకే భంగము గలుగు ననియు, అట్టియెడ నా మహోద్వేగము నంకెకుఁ దెచ్చుట దుస్తరమనియు, ఇట్లు తర్కవితర్కములలోఁ బడి వితాకు జెంది వారు కర్తవ్యముతోఁపక కొంతకాలము తటమటించిరి,

ఈ సందర్భమున, తొల్లి కంసుఁడు శ్రీకృష్ణుని సంహరించుటకే మార్గమును దోఁపక తన మిత్రులతో నాలోచింపఁగా, వారు చెప్పిన ఈ క్రింది సమాధానము ప్రకృత విషయమున కనువర్తించుచున్నది.