పుట:మధుర గీతికలు.pdf/713

ఈ పుట ఆమోదించబడ్డది


హస్తమునఁ దాల్చి నీస్మృతిపుస్తకంబు
సారెసారెకు నాసక్తిఁ జదువుచుందు ;
ఎన్ని సారులు చదివినయేని గాని
మరల నొకసారి చదువంగ మనసు పుట్టు.

ఇలను బుట్టిన దాదిగా నింతదనుక
లేశ మేనియుఁ బ్రఖ్యాతి లేని నాకు
కలిగె 'పాపాయితండ్రి' యన్ గౌరవంబు
వద్దియంబులు నీ పేర వ్రాయుకతన.

ఎన్నఁడును నన్నుఁ గనివిని యెఱుఁగనట్టి
వారు సైతము జాబులు వ్రాసి రిట్లు
పుస్తకంబును నిన్నును బ్రస్తుతించి;
అహహ! ఎంతటి ధన్యుండ వయ్య నీవు?

“సుతులు చావరె? వారల స్మృతుల పేర
కరుణరస ముట్టిపడునట్లు కావ్యములను
వ్రాయరే నేఁడు సత్కవుల్ ? వాని నెల్ల
నీదు కృతితోడ సరిపోల్ప రాదు కాక!”