పుట:మధుర గీతికలు.pdf/711

ఈ పుట ఆమోదించబడ్డది



గాఢ మగు నీదు ప్రేమశృంఖలము చేత
మున్ను లొంగని మదగజంబు నగు నన్ను
శిక్ష యొనరించి లొంగఁదీసితివి యిట్టె
చటుల తీవ్ర వియోగాంకుశమున నేఁడు.

నాదు సంసారవనమునఁ బ్రోది గాంచు
బాల సహకారవృక్షంబు నేలఁ గూలె ;
విమల మగు నాదు మానసకమలమందు
నిచ్చఁ గ్రీడించు రాయంచ యెగిరిపోయె.

నా తలంపుల మొలక, నాచేతి చిలుక,
కొంగుబంగర, మరచేతి బొంగరంబు,
దొడ్డిలోపలి వేలుపుగిడ్డి, నాదు
పున్నెములమూట అక్కటా! నన్ను వీడె.

ఎవఁడు నాసౌఖ్యముల కెల్ల నవధి యంచు
నమ్మియుంటినో యాతండు నన్ను వీడె;
ప్రణయమా! నీవు నన్నింకఁ బాసి పొమ్ము;
మరణమా! నీవె నాపాలి శరణ మగుము.

76