పుట:మధుర గీతికలు.pdf/710

ఈ పుట ఆమోదించబడ్డది



నీవు మరణించి పదిరెండు నెలలు గడచె;
కాలము గతించుకొలఁది శోకంబు గూడ
అంతకంతకు నగ్గల మయ్యెఁ గాని,
ఇంచుకంతయు శాంతి వహింప దయ్యె.

ఇంతకాలమునుండియు నీవు నాకు
నందనుండ వయి కూర్చు నానందమునకు
పెక్కుమడుగుల నెక్కుడై పిక్కటిల్లె
నీదు మరణంబుచేఁ గల్గు ఖేదభరము.

శోకమా ! నిన్ను నాకూర్మిసుతుఁడు చనుచు
దనకు మాఱుగఁ జూచికొమ్మనుచు నాకు
అప్పగించెను గావున నందికొంటి
ప్రేమమీఱఁగ నినుఁ బెంచి పెద్ద సేయ.

'సుఖము లబ్బినయప్పుడు శోక మడఁగు'
నంచు నందురు; సౌఖ్యంబు లబ్బినపుడె
ఎక్కు డయ్యెను సంతాప, మీవు లేని
లోప మధికతరం బయి తోప నాకు.

75