పుట:మధుర గీతికలు.pdf/709

ఈ పుట ఆమోదించబడ్డది

విపర్యయము



సకలజనులును దమ దినచర్య లెల్ల
నరసి శోధించెదరు వత్సరాదినాఁడు,
నాదు దినచర్య పరిశోధనంబు సేయ
అన్ని పుటలను శోకంబె యాక్రమించె.

అకట! యెంతటి తారతమ్యంబు గలదొ
నాదు బ్రదుకున నొక్క యేడాఁదిలోనె?
నాఁడు నావంటి ధన్యమానసుఁడు లేఁడు
నేఁడు నావంటి దీన-మానిసియె లేడు.

నిరుడు నా మానసంబున నిశ్చలతయు
నిర్విచారత నిశ్చింత నిండియుండ,
నేఁడు నిర్వేదము నిరాశ నిస్పృహతయు
రాజ్య మేలుచు నుండి నిరంకుశముగ.

తావకవియోగ శస్త్రఘాతంబుచేత
గఁటువడియున్న నా గుండెగాయ మింక
కుదురువోవక లోలోన కుళ్ళి కుళ్ళి
అలముచున్నది నానాఁట సెలలు వాఱి.

74