పుట:మధుర గీతికలు.pdf/707

ఈ పుట ఆమోదించబడ్డది



పొద్దుననే లేచినేఁ డట్లతద్ది యనుచు
తోడిబాలురు వీధుల నాడుచుండ,
నిన్ను లేవఁ దటాలున నిదుర లేచి
దద్దఱిల్లితి నా ప్రమాదంబు నరసి.

వచ్చె దీపాల పండుగ వైభవమున
దీప కాంతులఁ బురమెల్లఁ దేజరిల్లె!
నేఁడు నాగృహదీపంబు నీవు లేమి
శూన్యమై తోఁచె నాయిల్లు శోభ దక్కి.

'పుట్టలోఁ బోయుదువ పాలు, పొట్టలోన?'
అనుచు నే నన, 'నీ పొట్టయందే' యంచు
పలికితివి కాదె నిరుడు నాగులు చవితికి;
'నేఁడు నా పొట్టఁ జిచ్చిడినాఁడ వేమి ?

మొన్న ముక్కోటి శ్రీరంగమునకు నేగి
దాఁటినాఁడవు వైకుంఠద్వార మీవు;
ఇపుడు ముక్కోటి వచ్చెనో యింక లేదో,
ప్రాతకాఁ పైతి వైకుంఠ పట్టణమున.

72