పుట:మధుర గీతికలు.pdf/706

ఈ పుట ఆమోదించబడ్డది

పం డు గు లు



ఈవు నా చెంత నుంటివ యేని, నాకు
పండుగులమీఁద పండుగుల్ వచ్చినట్లు,
ఈవు ననుఁ బాసి బోయితి వేని, నాకు
ప్రళయములవిూఁదఁ బ్రళయంబు పడినయట్లు.

నిరుడు కృష్ణాష్టమికి నీవు నిండు వేడ్క
ఉట్టి కొట్టఁగ నెగురుచు నుర్విఁ బడితి;
వకట! యుట్టికె యెగుర లేనట్టివాఁడ
వెట్లు స్వర్గంబునకు నిప్పు డేగి తయ్య

అన్ని పండుగులను వినాయక చతుర్థి
మఱతు నన్నను నా కెఫ్టు మఱపు రాదు ;
నాఁడు మాపాలిటి గణపతి నాఁగ నీవు
కానవత్తువు కన్నుల కఱవుదీఱ.

వేడుకలు మీఱ నిదె వచ్చె విజయదశమి;
చిన్ని గిలకలబద్దను చేతఁ బూని
'ఏమిరా కృష్ణ యాగడం బేల' యనుచు
పదము పాడుచు నా చెంత; గదియ వేమి?

71