పుట:మధుర గీతికలు.pdf/703

ఈ పుట ఆమోదించబడ్డది



తల్లిదండ్రులు కినుక చేఁ దన్నుఁ గొట్టఁ
దన శిరంబును వారి యక్కున గదించి
జాలి పుట్టంగ నేడుచు బాలుఁజూడ
ఉల్ల మెవ్వరి కైన రంజిల్ల కున్నె ?

ఇంతలో నవ్వు, నేడుచు సంతలోనె,
ఇంతలో వేఁడు, బెదరించు నంతలోనె,
ఇంతలో నల్గు, మనసిచ్చు నంతలోనె;
చిత్రములు గావె పసిపాప చేష్ట లౌర.

వింతవస్తువో తాయమో చెంత నిడిన
యంత కనకాభిషేకంబు నందినట్లు
పొంగి గంతులు వైచుచు నింగి ముట్టు;
అల్పసంతోషి కాఁడటే యర్భకుండు ?

పువ్వుఁ దేనియ తావియుఁ బుప్పొడియును
చిందకున్నను జెడకున్నఁ జెదరకున్న
ముద్దుబిడ్డల నవ్వుతోఁ బోల్పవచ్చు
క్రొత్తగా విచ్చు పున్నాగ గుచ్ఛకంబు.

68