పుట:మధుర గీతికలు.pdf/701

ఈ పుట ఆమోదించబడ్డది



బుడుతఁ డెవ్వఁడో చావ, నాపొంతఁ జనుచు
కంటఁ దడి పెట్టితిని నీవు జ్ఞప్తి రాఁగ,
చుట్ట మని యెంచి వారు నా చుట్టుఁ జేరి
గొల్లు మని యేడ్వ, సురిగితిఁ దెల్లవోయి.

చుట్టములు నన్నుఁ బిలువంగఁ జూడ నేగి
నేఁడు చూచితి నీ యీడుజోడువాని
పాప నొక్కని - ఏమి పాపంబొ కాని
గుండె జల్లన నేలపైఁ గూలినాఁడ.

అకట నీతోనె నాయాస లంతరించె,
వాంఛలడుగంటె, తలపులు వ్యర్థ మయ్యె
చిత్త ముడివోయె, పొల్లయ్యె జీవితంబు
ఎట్లు గడుపుదు కాలంబు నింకమీఁద ?

కేలఁ జిక్కిన రత్నంబు గోలుపోయి
గాజుపూసను గని తృప్తిగాంచినట్లు,
విమలగుణనిధి వగు నిన్ను విడనాడి
కడపుచుంటిని రిత్తసౌఖ్యములఁ దవిలి.

66