పుట:మధుర గీతికలు.pdf/699

ఈ పుట ఆమోదించబడ్డది

కా ల యా ప న ము



ప్రొద్దుపుచ్చఁగ నొకసారి పూలతోఁట
కేఁగియుంటిని - అక్కటా! ఏమి చెపుదు?
బూచులో యనఁ గనుపట్టె పూలచెట్లు,
గాలి సోఁకినగతి చల్లగాలి సోఁకె.

ఉబుసుపోకకు వెడలితి నొక్క-నాఁడు
నాదు మిత్రులతోఁ గూడి నావపైని,
పయిరగాలికి నల్లాడు పడవవోలె
ఉల్ల మెంతయుఁ జింతచే నూగులాడె.

ఎట్టులెట్టులొ కాలంబు నెట్టిపుచ్చ
అనుఁగుమిత్రునిఁ గూడి వయాళి వెడల,
అనునయింపఁగ నతఁడు మాట్లాడినట్టి
పలుకు లన్నియు నక్కటా! ములుకు లయ్యె.

నాటకముఁ జూడ నే నొక్క నాఁటిరాత్రి
అనుఁగు నెచ్చెలి కానితో నరిగియుంటి,
ఏమి చెప్పుదు నాతోడ నీవు లేమి
నాటకం బెల్లఁ గనుపట్టె బూటకముగ

64