పుట:మధుర గీతికలు.pdf/696

ఈ పుట ఆమోదించబడ్డది

చి త్ర ప ట ము



కన్నులారఁగఁ బ్రతిమను గాంచి యైన
కొంతయేనియు నూరట గాంతు నంచు
నీదు పటమును నా చెంత నిలిపికొనఁగ
ఊఱటకు మాఱు జనియించె నారటంబు.

చీటిమాటికిఁ జేరి నీ చిత్రపటము
ముద్దుగొందును, కన్నుల కద్దికొందు;
అకట! ననుఁ బాసిపోయితే యనుచు జాలిఁ
బలుకరింతును; పలవింతు; బలవరింతు.

అట్టె కాంతును జెప్ప లల్లార్పకుండ
అనుదినంబును నీదు ఛాయాపటంబు
కమ్ముకొనుచున్న బాష్పముల్ కన్నుదోయి
నిండి చూపున కడ్డమై నిలుచుదాఁక.

చెంత నిడుకొని యెపుడు నీ చిత్రపటము
కనులు చిల్లులు వోవఁగఁ గాంచి కాంచి
అగ్గలం బగు కోర్కుల కగ్గ మగుచు
ఉలికిపడి కన్ను మూయుదు నుస్సు రంచు.

61