పుట:మధుర గీతికలు.pdf/689

ఈ పుట ఆమోదించబడ్డది

ముద్దు



పాలమున్నీటి తరఁగలఁ బవ్వళించు
చిన్ని వెన్నుఁడొ యన వెల్ల సెజ్జమీఁద
చెన్ను మీఱఁగ నిదురించుచున్న నిన్ను
కంటి నొక రేయి కన్నులకఱవు దీఱ.

పండు వెన్నెల నీవు పన్నుండి యుండ
తమ్మిపువ్వులం దోఁగాడు తుమ్మెద' లన,
చల్లగాలికిఁ జెదరి నీపిల్లకురులు
మొగుడుకన్నులతోడ దోబూచులాడె

మంచుబిందుల తాఁకున సంచలించు
చివురు పెదవులమాటున సిరుల నీను
మల్లెమొగ్గలఁ బోలు నీ పల్లువరుస
చుక్క గుంపులతో నెక్క-సక్కె మాడె.

చిఱుత చెమ్మట గ్రమ్ము నీచిన్ని మొగము
చలువమంచున విరిసిన కలువవోలె
చెలువు గులుకంగ, తమకంబు నిలువ లేక
ముద్దుపెట్టుకొనఁగ నాకు బుద్ది పుట్టె.

54