పుట:మధుర గీతికలు.pdf/687

ఈ పుట ఆమోదించబడ్డది



ఈవు నేలపై కాల్జాఱి యేడ్చుచున్న;
'పప్పు తిన్నను పాఱిపో, ఉప్పు తిన్న
ఊరిపో' యని నే నన, ఊఱడిల్లి
ఎలమి న న్నలరించువా రెవ్వరింక ?

'ఎవరు ముందుగ నా చెంత కేగుదెంచు,
వాఁడె నాపాలి బంగారు 'బాలపిచిక '
అనుచు నే నన, గ్రక్కున నరుగు దెంచి
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక ?

'నాదు నోటను బెట్టుము నీదు వ్రేలు'
నీదు కంటను బెట్టెద నాదు 'వేలు'
అనుచు బాలురతోఁ బరిహాస మాడి
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక?

ఒప్పు లొలుకఁగ ‘ఒప్పులకుప్ప' లాడి
మోద మారఁగ 'దాగుడుమూఁత' లాడి
వేడుకలు మీఱ 'గుజ్జెన గూడు' లాడి
ఎలమి న న్నలరించువా రెవ్వ రింక ?

51