పుట:మధుర గీతికలు.pdf/684

ఈ పుట ఆమోదించబడ్డది



నీరు నూనియ పిండియు వేఱువేఱు
చిన్నగిన్నియలం దుంచి నన్నుఁ బ్రీతి
జలకమాడంగఁ జేయు నీ విలసనంబు
మఱవ శక్యమె యెన్ని జన్మము లకైన?

‘చిన్ని చిలుకను జూచితే నాన్న?' యనఁగ,
'ఏది యే' దని నే నన, 'ఇదిగో' యనుచు
తన్నుఁ జూపించి నవ్వు గద్దరితనంబు
మఱవ శక్యమె యెన్ని జన్మముల కైన.

'తండ్రి! చూపెద నీ కొక్క తాయ' మనుచుఁ
బలికి, నామీఁద రబ్బరుపాము విసిరి,
అట్టె చప్పట్లు గొట్టు నీయాగడంబు
మఱవ శక్యమె యెన్ని జన్మముల కైన

‘ఏడువకు మేడువకుము, నీ వేడ్చి తేని ?
కనుల జలజల నీలాలు గాఱు' ననుచు
చిట్టి తమ్ముని నీవు జోకొట్టు హొయలు
మఱవ శక్యమె యెన్ని జన్మములకైన

49