పుట:మధుర గీతికలు.pdf/681

ఈ పుట ఆమోదించబడ్డది


కొమరుమోవిని సుధ గిలకొట్టవచ్చు
మొలక నవ్వుల వెన్నెలల్ చిలుకవచ్చు
చిన్ని కురులందు చీఁకట్లఁ జిమ్మవచ్చు
తీయపలుకుల కలకండ తీయవచ్చు.

విమల మగు నీదు చిఱునవ్వు వేయి సేయు
లలిత మగు నీదు వాల్చూపు లక్ష సేయు
కులుకుటొయ్యారి నీ నడ కోటి సేయు
నిద్ద మగు నీదునును సిగ్గు నిధులు సేయు.

చలువ నునుముంచుబిందుల జాలుకొలిపి
పండు వెన్నెల పిండిని పదనుచేసి
మెఱుఁగులందలి తళుకుల మేళగించి
చేసెఁ గాఁబోలు నలువ నీ చెలువ మౌర!

ఒప్పు లన్నిటి నొకచోట కుప్ప వోసి
అందములు నెల్ల నొక్కెడ పొందుపఱచి
గుణము లన్నియు నొకచక్కి కూర్చి పేర్చి
సలిపె విధి నీదు నెమ్మేని చక్కఁదనము.

46