పుట:మధుర గీతికలు.pdf/678

ఈ పుట ఆమోదించబడ్డది


నిండు బిగియారు కౌఁగిట నిన్నుఁ బొదివి
నీదు తనుధూళి తల మేనినిండ సోఁక
హాళి నిన్నెత్తికొని ముద్దులాడినట్టి
వానిజన్మంబు జన్మంబు వసుధమీఁద

నిగ్గు దేఱెడి నీపాలబుగ్గలందు
గిలిగిలింతల గిలకొట్టి, తళుకునవ్వు
వెన్న ముద్దలఁ జిలికించి యెన్ని సార్లు
జుఱ్ఱియుంటినో చుబ్బనచూఱగాఁగ?

సరస సంగీత సాహిత్యభరిత మగుచు
శ్రుతిహితం బగు త్యాగయ్యకృతిని బోలె,
చిన్నదయ్యును తావక జీవితంబు
రసికజనరంజకం బయి రమణగాంచె.

స్వచ్ఛతరమయి మాధురీ సహిత మగుచు
సురుచిరామోదజనకమై సుమము వోలె
చిన్నదయ్యును తావకజీవితంబె
బంధురానందకర మయి వన్నె కెక్కె.

43