పుట:మధుర గీతికలు.pdf/676

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రణయము


ఏమి మహిమంబు గలదొ నీనామమందు ?
'పాప' యను పల్కు వీనులఁ బడినయంత
నిలువునను నాదు మే నెల్లఁ బులకరించు
జల్లు మని నాదుహృదయంబు జలదరించు.

ఓహో! నీనామ మెంత మనోహరంబొ
మించు వేడుకతో స్మరియించుకొలఁది
నిశ్చలం బగు భక్తి ధ్యానించుకొలఁది
కూర్చుచున్నది నానాఁట క్రొత్తరుచులు.

సర్వ సారస్వత ప్రపంచంబునందు
'పాప' యనియెడి యక్షర ద్వయముతోడ
సాటి వచ్చెడు కొండొక మాట గలదె
మార్దనంబున మధురిమ మంజులతను?

జల్లు మని నోట ముత్యాలు జాఱ, నీవు
పలుకు తొలిపల్కు లే నాకు తొలి పలుకులు;
జిలుగుగా నీవు పలక పై గిలుకు మొదటి
యక్షరమె నాకు మొదలిటి యక్షరంబు,

41