పుట:మధుర గీతికలు.pdf/673

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ త్మ శాం తి




వ్రాసితిని మొన్న ననుతాప పద్యములను,
ఇంక చేతడియార లే; దింతతోనె,
వ్రాయఁ జేసితె సంతాన పద్యములను
కూర్మిపుత్రుని మరణంబు గూర్చిఁ దేవ !

పట్టి యంచును మూన్నాళ్ళ పట్టపగలు
పొంగిపొరలుచు మరియుచు బోర్లపడితి;
ఇచ్చితివి వాని, కమ్మరఁ బుచ్చికొంటి,
వాఁడు నీవాఁడు కాని నావాఁడు కాఁడు.

నేను నన్నె కాపాడుకో లేనివాఁడ,
వానిఁ గాపాడ నేర్తునే! కాన నీవె
చెంతఁ జేరిచి వాని రక్షింపవయ్య!
నీకుఁ గలిగిన బాధ్యత నాకుఁ గలదె?

అతఁడు నాచెంత దుఃఖంబు లనుభవించు
చుండుకంటెను, నీపాదయుగళిపొంత
నుంటయే శుభం బగు; 'ఇంటికంటె గుడియె
పదిల మగు' నంచు బుధులు చెప్పుదురు కాదె?

38