పుట:మధుర గీతికలు.pdf/669

ఈ పుట ఆమోదించబడ్డది

నిర్వేదము



విద్య నేరిచి ప్రఖ్యాతి వెలయ లేదు.
ధనముగడియించి దీనులఁ దనుప లేదు.
భోగముల చేత సౌఖ్యంబుఁ బొంద లేదు.
గడపిపుచ్చితి కాలంబు కాకివోలె.

వయసు ముదిరెను, సుఖముపై వాంఛ తొలఁగె,
ప్రాణసములైన మిత్రులు బాసి, రకట!
పండువంటి కుమారుఁడు పదటఁగలసె;
బ్రతికి యుంటిని జీవచ్ఛవంబ నగుచు.

బందుగుల కెల్ల గిట్టనివాఁడ నైతి,
మిత్రు లెల్లరు నొక పెట్ట శత్రు లైరి.
అనుఁగుపుత్రుఁడు గికురించి చనియె దివికి;
ఎట్లు బ్రదుకుదు పుడమిపై నింకమీఁద ?

మున్ను నమ్మితి విగ్రహపూజనంబు,
ఆవల నమ్మితి మానసి కార్చనంబు,
ఇదియు నదియును మదియందు కుదురనయ్యె;
రెంటికి చెడ్డ రేవనిరీతి నైతి.

34