పుట:మధుర గీతికలు.pdf/667

ఈ పుట ఆమోదించబడ్డది

మా న స బో ధ ము



బలిపదము దొట్టి, అల బ్రహ్మపదము దాక
సంక్రమింపఁగఁ జూచెదు చాపలమున;
లోన వెలిఁగెడి బ్రహ్మంబు లో నెఱింగి
తలఁప వెన్నఁడు చిత్తమా! తప్పిదారి.

గండుపులివోలె వెఱపించుచుండె ముదిమి;
ఓటికుండను బోసిన నీటిఁ బోలె,
అంతరించుచు నున్నది ఆయు వకట!
వెడగుచిత్తమ ! యిం కేల మిడిసిపాటు ?

తన్ను పెనుబాము కబళించుచున్న తఱిని
ఈగలం బట్ట కప్ప తా వేగిరించు
భంగి, కాలభుజంగము మ్రింగ నున్న,
విషయవాంఛల వీడవు వెకలిమనస!

నీదు వాంఛలు నాసలు, నీదు కోర్కె --
లన్నియు కటా! పటాపంచ లయ్యెఁ గాని,
శిలను జేసిరొ ? యినుమునఁ జేసిన నిను ?
నిలిచియుంటివి నిట్రాడువలెను మనస !

32