పుట:మధుర గీతికలు.pdf/666

ఈ పుట ఆమోదించబడ్డది

కర్మము



వాయువశమున నెగయుచు వారిదంబు
లొకటఁ గూడుచు వీడుచు నుండుపగిది,
కాలగతిఁ జేసి జీవు లొక్కటన కూడి
వీడుచుందురు కర్మంబు మూడినంత.

కర్మమున జీవి యుదయించు, కర్మవశత
వర్ధనము గాంచు, కర్మంబువలనఁ ద్రెళ్ళు;
కర్మమే కష్టసుఖముల కారణంబు,
కర్మమే దైవ మఖిలజగంబులందు.

కర్మమున మేలు కలుగును, కర్మముననె
కలుగు కీడును, సకలంబు కర్మవశమె;
బమ్మ యైనను కర్మంబు క్రమ్మఱింపఁ
జేయలేఁ డన్న, నితరులఁ జెప్ప నేల ?

తొంటి తన కర్మములు వెంటనంటి త్రిప్ప,
పుడమి నొక్కొక్క దేహంబుఁ బడసి పొడమి
ఒండుత్రోవను బోవుచు నుండు దేహి?
చావు పుట్టువు సహజంబు జీవతతికి.