పుట:మధుర గీతికలు.pdf/664

ఈ పుట ఆమోదించబడ్డది

అస్థిరత



ఆయు వల్పంబు, భోగంబు లస్థిరములు,
పుత్ర మిత్ర కళత్రముల్ బుద్బుదములు,
సకల ధనధాన్య సంపదల్ చంచలములు,
అనుచుఁ దెలిసియు నరుఁడు మోహాబ్ధి మునుఁగు.

దేహ మెన్నఁగ గాలిలో దీపకళిక,
కలలలోపలి ముచ్చటల్ కల సుఖములు,
పుత్రసంగతి తెరలోని బొమ్మలాట;
హేయభాజన మక్కటా! యిహసుఖంబు.

శైశవం బెన్న నఖిల రోగాశయంబు,
యౌవనంబు సమస్తపా పాలయంబు,
వార్ధకం బది దుర్వ్యథావర్ధకంబు;
సౌఖ్య మొందుట యెన్నఁడో జనుఁడు భువిని.

కాలపరివర్తనమున దుఃఖంబు సుఖము
సకలజనులకు నెడ నెడ సంభవించు;
ఖేద మొదవిన క్రుంగుచు, మోద మొదవ
పొంగుచుండరు సతతంబు బుధులు మదిని.

29