పుట:మధుర గీతికలు.pdf/663

ఈ పుట ఆమోదించబడ్డది

సంసారము



తల్లి నా కిది యీతండు తండ్రి నాకు,
ఇదియ యిల్లాలు, నా కిది యిల్లు, నాదు
సుతులు వీరలు, వీరలు హితు లటంచు
జడుఁడు భ్రమజెంది పుట్టుచుఁ జచ్చుచుండు.

చెలియె మృత్యువు ? చుట్టమే తలఁప యముఁడు?
శిలయె దేహంబు ? గాఢమే జీవ మెన్న ?
మాయసంసార మిది కడు హేయ మంచు
తెలియ కజ్ఞుండు తలపోయు స్థిర మటంచు.

తన గృహంబున నభ్యాసమున మెలంగు
అంధుని విధంబు, సంసారమందుఁ దిరుగు
మూఢుఁ డెఱుఁగునె నిక్కంపు ముక్తి తెరువు ?
అరయ విజ్ఞానవిదుఁడు తా నెఱుఁగుఁ గాక.

శిశువు, బాలుండు, తరుణుండు, ముసలి యనఁగ,
వివిధ పాత్రంబుల ధరించి భువిని నరుఁడు
నటుని కైవడి సంసార నాటకంబు
నాడి, నరక మన్ తెరలోని కరుగు తుదిని.

28