పుట:మధుర గీతికలు.pdf/662

ఈ పుట ఆమోదించబడ్డది

వైరాగ్యము


తాను చావక మానెడివానిభంగి
వగచు జీవుండు చచ్చిన వానిఁ గూర్చి,
చావకయ యుండ దాఁకొనశక్య మగునె ?
ఎచటఁ బుట్టెనో యచ్చటి కేగు నరుఁడు.

పుట్టినంతన మూరెడు పొంగ నేల ?
త్రుంగినంతన బారెడు క్రుంగ నేల ?
పుట్టువాఁ డెన్నఁడేనియు గిట్టకుండ
ఉట్టికట్టుక యూఁగునే యుర్వియందు ?

'నిన్నఁ జూచితి, వాఁ డెంతో చెన్ను మీఱె ,
నేఁడు తెగవాఱె , ననుచుఁ జింతించు నరుఁడు,
ఎల్లి తనచావువచ్చు నం చెఱుగ లేఁడు;
అరయ క్రిందాకు మీఁదాకు వరుస కాదె!

ఘోర సంసార వారాశిఁ గోట్లకొలఁది
పుత్ర మిత్ర కళత్రముల్ బుడగలట్లు
పుట్టుచుందురు, పొరిపొరి గిట్టుచుందు?
రిట్టివారికి నగఁ జెంద నేల నరుఁడు?

27