పుట:మధుర గీతికలు.pdf/659

ఈ పుట ఆమోదించబడ్డది



పుట్ట కున్నను లెస్సయె, పుట్టి పెరిగి
తల్లిదండ్రుల యుల్లంబు లుల్లసిల్లఁ
జేయు నందనుఁ డెడఁబాసి పోయె నేని,
అట్టి దుఃఖము వర్ణింప నలవి యగునె?

పుట్ట కుండిన దుఃఖంబు, పుట్టి పెరిఁగి
వ్యాధిగతుఁ డైన నెంతయు వ్యాకులంబు,
అవల మృతి నొంద దుస్సహ; మక్కటకట'
కష్టబహుళంబు పుత్రసంగతి తలంప.

తన్నుఁ గని పెంచి ముద్దాడు తల్లిఁ దండ్రి,
బాళి లాలించు నెల్ల చుట్టాలు విడిచి,
కూర్మిఁ దెగఁ గోసి నట్టేటఁ గూల్తు రకట!
శత్రువులు గాక మిత్రులే పుత్రు లరయ

24