పుట:మధుర గీతికలు.pdf/658

ఈ పుట ఆమోదించబడ్డది

పుత్రుఁడు



కూడు సైచదు, కనులకు కూర్కు రాదు,
స్వాంతమున తేళ్ళు ప్రాకిన పగిదిఁ దోఁచు,
కనుల జలజల బాష్పముల్ కాల్వ గట్టు
ఆత్మజవియోగదుఃఖ మత్యంతభరము

నడక తడఁబడు, మై గడగడ వడంకు,
'బెదరు గుండియ, మాట తబ్బిబ్బునొందు,
బెండువ తాల్మి, మది కలగుండు వడును;
పుత్ర విరహంబు వల దెట్టి శత్రువులకు.

జగతి యంతయు శూన్యంబ యగుచుఁ దోఁచు,
ఎల్ల సుఖములపైఁ గడునేవ పుట్టు,
వ్యర్థ మేటికి జీవన మనుచుఁదోఁచు;
దుర్భరము పుత్రనిర్యాణదుఃఖ మిలను.

మంచిగందము 'వెన్నెల మంచుకంటే
శీతలకరంబు నందనాశ్లేషసుఖము;
ఉడుకు నూనియ, కార్చిచ్చు, పిడుగుకంటె
ఉగ్రతాపంబు పుత్రవియోగ భరము.

23