పుట:మధుర గీతికలు.pdf/656

ఈ పుట ఆమోదించబడ్డది

వి లా ప ము



ఒక్కతరి కన్ను మూయుదు, నొక్క యెడను
కనుల నటె విచ్చి వెడ వెడఁ గాంతు బయలు;
ఒక్క వేళను తలయూఁతు, నొక్కసారి
ఉస్సురంచును వేఁడినిట్టూర్పు పుత్తు.

రాత్రి యరుదేర, నిద్దుర రాక వేఁగి
పగలె మే లని యెంతును, పగలు రాఁగ,
రేయి, మే లని యెంతు; నీరీతి గాఁగ
పగలు రేయియు నాపాలి పగలె యయ్యె.

ఒంటిపాటున దుఃఖంబు నోర్వలేక
పలువు రుండఁ దలంతును, పలువు రుండ
ఒంటిగా నుండఁ దలఁతు; నీయోజ నిట్లు
గడపుచుంటి దినంబు యుగంబురీతి.

వెల్లివిరియుచు తీరంబు పెల్లగించి
వఱ్ఱు లొడ్డుచు పాఱు ప్రవాహ మనఁగ,
నిండి నిబిడీకృతం బయి గుండెఁ జీల్చి
పొంగి పొర లెడి దుఃఖ మభంగురముగ.

21