పుట:మధుర గీతికలు.pdf/655

ఈ పుట ఆమోదించబడ్డది



'మామకును తాత కెన్ని యో మంచి బండ్లు,
మంచి మోటారు లున్నవి, మనకు లేవు;
నాన్న! నే పెద్దవాఁడ నై యున్న యపుడు
ధనము గడియించి కొనెద' నం చనఁగ లేదె?

'మూడునిలువులు కలిగిన మేడ తాత
కట్టె, నాలుగంత స్తులు గలుగు మేడ
కట్ట మామయ్య; నేనిదె కట్టువాఁడు
ఐదునిలువులు గల సొగసైన మేడ;

'అమ్మ కొక్కటి, నీ కొండు, అన్న కొకటి,
అక్క కొక మేడ యిత్తు, నే హాయి మీఱ
నుందు పై మేడపై నంచు' నందు; వకట!
మిద్దె లిన్నియు నింతలో మిథ్య లయెనె ?

మాకు మేడలు లేకున్న మానెఁ గాని,
కట్టకొంటివి నీ కొక్క గట్టిమేడ,
అన్ని మేడలపై నున్న యట్టి మేడ,
స్వర్గసౌధంబు; అందైనఁ బడయు సుఖము.

20