పుట:మధుర గీతికలు.pdf/652

ఈ పుట ఆమోదించబడ్డది


మరణ వేళను కుత్తుక గుఱక పుట్ట.
చుఱుకు మని నీదు నుదుటను చుఱక వెట్టి;
రది తలంచిన నా గుండె లక్కటకట!
చుఱుకు మనుచుండె కొఱవితో చూడినట్లు.

మఱపు దుఃఖంబునకు మంచిమం దటంచు
పెద్ద లందురు; కావున నెద్ది యైన
కార్య మొనరింతు నన్న, నా కార్య మెల్ల
మఱపునకు వచ్చు; నీ వెప్డు మఱపు రావు.

నాదు పొత్తునఁ గుడుతువు, నాదు సెజ్జఁ
బవ్వళింతువు, నాపజ్జఁ బాయకుందు,
వకట! తలలోని నాల్కవై యలరు నీవు
మఱపువత్తువె నే నెంత మఱతు నన్న ?

మొలకనవ్వులు మొగమునఁ దొలకరింపఁ
మెడను కర్పూరహారంబు తడఁబడంగ,
చెంగుచెంగునఁ బరుగెత్తి చేరవచ్చు
నిన్నుఁ జూచితి కలలోన నేఁడు కుఱ్ఱ!

17