పుట:మధుర గీతికలు.pdf/651

ఈ పుట ఆమోదించబడ్డది


తొట్టెతానము చేయుచున్నట్టివేళ,
వచ్చియును రాని జిలిబిలి పలుకు లొలయ
ముద్దుకృష్ణుని పద్దెముల్ ముద్దు గులుక
చదువుచుందువు; నేఁ డట్లు సలువ వేమి ?

వేడుకలు మీఱ నీవు నీ తోడివారిఁ
గూడి కిలకిలలాడుచు నాడి పాడు
చుండ, కలకలలాడుచు నుండు నిల్లు
అక్కటా' నేఁడు వెలవెలలాడుచుండె.

తోడిబాలురఁ గూడి నీ వాడుకొనుచు
బమ్మరిల్లుచు నుండ, నీ బొమ్మరిల్లు
కనులపండువు సేయుచుఁ గానవచ్చె;
కడుపు చుమ్మలుచుట్టెరా కాంచ నేఁడు.

తొట్టిలో నీవు కూర్చుండి తూఁగులాడు
చుండ, నుట్టిలో గుమ్మడిపండులీలఁ
గానవత్తువు కన్నులకఱవు దీఱ;
పొట్టుపొర లయ్యె నేఁడు నీ తొట్టి చూడ,

16