పుట:మధుర గీతికలు.pdf/649

ఈ పుట ఆమోదించబడ్డది

స్మరణము



కన్నె వెన్నెల లొలయించు చిన్నినవ్వు,
తేట తేనియ లొలికించు తీయపలుకు,
హొయలు గులికించు నడకల యొప్పిదంబు
ఎట్టు మఱతును నను గన్న చిట్టితండ్రి  ?

ఒయ్యనొయ్యన నొయ్యార ముట్టిపడఁగ
హొయలుమై నీవు నడయాడుచుండఁ జూచి,
చిన్ని యేనుంగుగున్నను గన్నయట్లు,
చెంగలించుచు నామది నింగిముట్టు.

కనులు మూసిన, విచ్చిన, కలలు గన్న,
పను లొనర్చిన, తలఁచిన, పలుకుచున్న,
నిలిచియున్నను, మెలఁగిన నీదుమూర్తి
కనులఁ గట్టినయట్టులు కానవచ్చు.

సొగసు గుల్కెడు నీదు దుస్తులను జూచి,
ఎలమి నీ వాడుకొను వస్తువులను జూచి,
అకట! నీ యీడుజోడు బాలకులఁ జూచి,
గుండె చెఱువయి పోవుచు నుండెఁ గదర

14