పుట:మధుర గీతికలు.pdf/648

ఈ పుట ఆమోదించబడ్డది


ఎపుడు నీమీఁద ప్రేమచే నింపు మీఱ
బుగ్గ నులుముచు, నీ చిన్ని బొజ్జ నిమిరి,
గిలిగిలింతలు పెట్టి నగింపఁ జేయు
మామపై నైన నీ కింత మమత లేదె?

పట్టఁజాలని తమకంబు బాయ లేక,
లీల నిను పాను పెక్కించి మేల మొప్ప
నొవ్వ నేడ్పించి, తోతోన నవ్వఁ జేయు
మామ విడనాడ నీ కెట్లు మనసు గొలిపె?

'కడుపు గలిగిన ఫలముగ కాంక్ష దీఱ
కన్న నిటువంటి కొడుకునే కాంచవలయు’
అనుచు నిన్నెత్తుకొని ముద్దు లాడునట్టి
చిట్టియ త్తను వీడ నీ కెట్టు లొప్పె?

నీవు మరణించినది యాది, నీదు తల్లి
నిదురయును కూడు నెఱుఁగక, నేలఁ బొరలి,
గొల్లుమని యేడ్చుచున్నది గుండె పగుల;
తల్లి నిటు లేడిపింపగఁ జెల్లు నయ్య ?

13