పుట:మధుర గీతికలు.pdf/647

ఈ పుట ఆమోదించబడ్డది


'నాదు గద్దియపై నెక్కినాఁడ వేర?'
అనుచు నీ తాత నిను మేలమాడ, నతని
వీపుపై దువాళించి నవ్వింతు వెలమి?
అట్టి తాతను వీడ నీ కెట్టు లొప్పె?

పుత్రమోహము కడుపార పొంగి పొరల
కొడుకు కుఱ్ఱలు లేరను కొఱఁత దీఱ,
నిన్ను లాలించి ముద్దాడుచున్న నీదు
పిన్న యమ్మమ్మపై నైన ప్రేమ లేదె?

'అవని నాతండ్రి యీతఁడై యవతరించె,
వంశమున కెల్ల వన్నెయు వాసి తెచ్చు
అనుచు నినుఁ జూచి మురియు చున్నట్టి నీదు
అయ్య విడనాడఁగా నీకు న్యాయ మయ్య?

'నన్ను డబుల నడిగెదు, నాకు తండ్రి
నీవు కావున నీవె నా కీయవలయు'
అనుచు నిను లీలఁ బరిహాస మాడునట్టి
అయ్య విడనాడ నీ కెట్టు లయ్యె మనసు?

12