పుట:మధుర గీతికలు.pdf/644

ఈ పుట ఆమోదించబడ్డది


'రంగు తేరికి కొయ్యయేనుంగు కట్టి
ఆడుకొన నాకు వేడుక యయ్యె నయ్య!
గొలుసు కొను,' డని యంటివి; కొనెడిలోనె
తెంచికొంటివి మనల బంధించు గొలుసు.

'ముద్దు' పేరిట పద్దియముల రచించి
ప్రేమమై నీకు కృతి సమర్పింప నెంచి
నీవు జీవించియుండంగ నేర నైతి;
అక్కటా! నేఁడు నా 'ముద్దు' ముక్క లయ్యె.

‘మూడు చక్రాలబండిపై ముచ్చ టయ్యె.
కొనఁడు మామయ్య, నీవైన కొనఁగదయ్య!'
అనుచు పలుమఱు వేఁడిన, అక్కటకట!
నీదు తుదిముద్దు చెల్లింప నేర నైతి.

నాకు కృష్ణున కీవు నందనుండ వగుట,
ప్రేమమై కాముఁ డను ముద్దు పేరు పెట్టి
యుంటి; నా కుమారుండ వై యుండ కకట!
నాకు మారుండ వై యుంట నీకు తగునె?

9