పుట:మధుర గీతికలు.pdf/641

ఈ పుట ఆమోదించబడ్డది


నిండు చందురుఁ బోలు నీ నెమ్మొగంబు
గాంచి చిరజీవి వగు దని యెంచియుంటి;
అకట! ఆజేండ్ల చిన్ని పాయంబునాఁడె
నిండినే నీకు నూఱేండ్ల నిండువయసు?

మింట నొకసారి తళుకున మెఱుపు మెఱసి
అంత త్రుటిలోన నె యదృశ్య మైన చుట్లు
అల్ప కాలంబుననె లీల లన్ని చూపి
అట్టె తటుకున మటుమాయ మైతివయ్య.

అరయ నాఱేండ్ల లేఁతపాయంబులోనె
అఖిల సద్గుణగణముల సభ్యసింప
నగును ధారుణిఁ గల మానవాళి కెల్ల
అనుచుఁ జాటింపఁగాఁ బట్టి చనితె దివికి?

పూత చారిత్రుఁడైన నీతాతగారి
పూజ్య బగు నామమును నీవు పూనియుంట,
ఇల్లు నిలఁబెట్టి నాముప్పు వెళ్ళఁబుత్తు
వనుచుఁ దలఁచితి, నది మెల్ల వ్యర్థమయ్యె.

6