పుట:మధుర గీతికలు.pdf/640

ఈ పుట ఆమోదించబడ్డది

మరణము


కలల నైనను సత్యంబె పలుకువాఁడు,
పలుకు పలుకునఁ దేనియల్ చిలుకువాఁడు,
దైవసములుగఁ బితరులఁ దలఁచువాఁడు,
నన్ను దిగ నాఁడి యక్కటా! నాక మేగె.

చెక్కు గీటిన పాల్గొఱు చిఱుత వాఁడు,
పూపపాయంపు బుడుతఁడు, ముద్దులాడు,
నాదు చిన్నారి పొన్నారి నందనుండు
నన్ను శోకాబ్ధిఁ బడద్రోసి నాక మేఁగె

శ్రుతుల సమ్మేళనము చేసే సొంపు మీఱ
రాగ మాలపింపగ, వీణ బ్రద్ద లయ్యె;
ముద్దు ముచ్చట మురిపంబు మురువు చూచి
మోదమునఁ దేలుచుండ, నాపుత్రుఁ డీల్గె.

శుక్తి వుటమునఁ బడనున్న సోనచినుకు
వాయువశమున గుల్లలోఁ బడినయట్లు.
ధన్యజన్మము నొందఁగఁ దగినవాఁడు
కాలగతిఁ బుట్టె నిర్భాగ్యు కడుపునందు.

5