పుట:మధుర గీతికలు.pdf/623

ఈ పుట ఆమోదించబడ్డది



'లేమరో ! నాకు తనయులు లేరు గాన,
రాజ్జి యిద్దియె నాదు సర్వస్వమునకు;
దాని కీవయె తల్లివి తండ్రి వగుచు
ప్రీతిమై నాదు కుల ముద్దరింపు మమ్మ!'

కన్నకూఁతురు వోలె, నా చన్ను గుడిపి
సాకితిని దాని, అది యొక్క సంజవేళ,
ప్రాణములు వాయ, దానికి బదులు నాదు
కన్న బిడ్డను నిలిపితి నిన్ను సరళ !"

అనుడు వెఱఁ గంది, యీరీతి ననియె సరళ :
“జనని ఎంత యకృత్యంబు సలిపి తమ్మ :
నృపతియల్లుని రాజ్యంబు నపహరించి,
కట్టితివి దాని నాకు నీ కన్నసుతకు.

'ఒరుల రాజ్య మపేక్షింప నొల్ల, నింక
నీవు చేసినయట్టి యా నేరమునకు
ప్రతికృతిగ వాని రాజ్యము వాని కొసఁగి,
కానలకు నేగి కడపెద దీనవృత్తి."

68