పుట:మధుర గీతికలు.pdf/615

ఈ పుట ఆమోదించబడ్డది



కన్ను గానక కూళనై యిన్ని నాళ్ళు
కూల్చితిని జీవరాసులు కోట్లకొఁలది,
కట్ట ! నిను గూడ నా పొట్టఁ బెట్టికొనుచు
ఘోరనరకానలంబునఁ గూలఁ జాల.

నీదు ధర్మమే నిను గాచె, నేను నిన్ను
గాచిపుచ్చితి నను మాట కల్ల, నేను
నిన్ను గెలుచుట యటు లుండె, నీవె నన్ను
గెలిచికొంటివి సత్యవాగ్విభవకలన.'

అనుడు, ధేనువు వచియించే 'వ్యాఘ్రరాజ !
ఏల యీరీతి పలికెద ? వేను మున్ను
ధారవోసితిఁ గాదె యీ తనువు నీకు ?
చింత యేమిటి కింక భక్షింపు మయ్య,

ఈవు నను గాచి విడువ. నే నింటి కేగఁ
గాంచి. 'ఈ యావు పులిఁ గికురించి వచ్చె.
మాయురే ! ఎంత మాయలమారి ! యంచు
నెల్లి దంబులు సేయరే యెల్లవారు ?