పుట:మధుర గీతికలు.pdf/613

ఈ పుట ఆమోదించబడ్డది



అనుచు నీరీతి తనతోడ నావు పలుక,
చిత్ర మది యేమొ - పులి యంత చేష్ట లుడిగి
తేఁకువను గోలుపోవు, వితాకు జెందు,
కనుల నటె విచ్చి వెడవెడ గాంచు బయలు.

ఎదుట నిలిచిన యావుఁ గన్నెత్తి కనఁడు,
గడగడ వడంకు, బాష్పముల్ కనుల నించు,
గొణుఁగు దనలోన, వేదురు గొన్నభంగి
నుండు, తలయూచు, వెచ్చని యూర్పు పుచ్చు.

కరుణ యెట్టిదొ కలనైన నెఱుఁగనట్టి
వ్యాఘ్ర మీరీతి శౌర్యంబు పరిహరించి
దీనవృత్తిని వహియించి, మౌనముద్ర
నుంట గనుఁగొని యక్కజ మొంది యావు,

అఱ్ఱు పై కెత్తి గంగడోల్ బిఱ్ఱిబిగియ
పుండరీకము పొంతకుఁ బోవ, వ్యాఘ్ర
ముస్సురసు రని వెచ్చనిట్టూర్పు పుచ్చి
మార్మొగము పెట్టి వెనుకకు మరలిపోవు.

58