పుట:మధుర గీతికలు.pdf/612

ఈ పుట ఆమోదించబడ్డది



అంచు పెటపెట పండ్లు దీటించుకొంచు
కడిఁదియాకట కటకటఁబడుచునున్న
పులికుఱంగట నొయ్యన నిలిచె గోవు,
చుక్క తెగి రాలిపడినట్లు చక్కవచ్చి.

ఇట్టు లరుదెంచి, పులిచెంత నిట్టనిలిచి,
ధేను విట్లనె 'పులిఱేడ నేను పోయి
ఎంతో తడ వయ్యె, అక్కటా! యింతదాఁక
ఎట్టు లుంటివొ యాఁకట బిట్టు దూలి ?

వ్యాఘ్రరాజమ ! నీ చేసినట్టి మేలు
మఱవ శక్యమె యెన్నిజన్మముల కైన ?
నీ దయారసకలనచేఁ గాదె యేను
బుజ్జగించితి సుతునకు బుద్ది సెప్పి.

నాదు కోరిక దీఱెను, నీదు కోర్కి
యింక దీఱఁగ నా దేహ మిదిగో నీకు
ధారవోయుచునుంటిని, తనివి దీఱ
నారగింపుము తడవు సేయంగ నేల ?'

57