పుట:మధుర గీతికలు.pdf/610

ఈ పుట ఆమోదించబడ్డది



కొఱవీచేఁ గాల్చినట్టులు, సురియ బెట్టి
వ్రచ్చినట్టులు, కొఱ్ఱున గుచ్చినట్లు,
ములుకులను బోలు తన తల్లి పలుకులు విని
గుండె లవియంగ నేలపైఁ గూలె దూడ.

అంబ యను, నన్ను వీడ నాయంబ యనును,
వనట ముంచితె చెనఁటి దేవంబ ! యనును,
ధరణి నా జీవ మింక వ్యర్థంబ యనును,
అకట ! పులి యేల దాపురం బయ్యె ననును.

అనుచు పలవించు తనయుని కనియె గోవు;
'జీవియై పుట్టుపిమ్మట చావు నిజము,
ఉరక చచ్చుటకంటెను, పరులకొఱకు
మరణ మొందుట పరమధర్మంబు గాదె?

అమలసత్యంబె యూతఁగా, వ్యాఘ్రవక్త్ర
గహ్వరం బది మోక్షమార్గంబు గాఁగ
స్వర్గసుఖముల చూఱాడఁ జనుచునుంటి;
అహహ ! యింతటికంటె భాగ్యంబు కలదె ?'

55