పుట:మధుర గీతికలు.pdf/604

ఈ పుట ఆమోదించబడ్డది



అనుడు, పులికి ప్రదక్షిణ మాచరించి
కనుల నానందబాష్పముల్ క్రమ్ముకొనఁగ,
అరిగె పరుగున ధేను 'వంబా' యటంచు
పొదుఁగువేఁగున తడఁబడ పదచయంబు.

ఆ సుధామధురధ్వని యాలకించి
వత్స ‘మంబే’ యటంచును పరుగువాఱి
మాతకడ కేగి పొదిక్రింద మూతి దూర్చి
గుప్పుగుప్పున దుగ్ధముల్ గుడిచికొనియె.

ముట్టెతోఁ గ్రుమ్మి పొదుఁగుపై పొడిచి పొడిచి
కొడుకు పాల్ ద్రావుచున్నంతతడవు, తల్లి
అట్టు నిట్టును మెదలక యట్టె నిలిచె,
తెల్ల ఱాతిని మలఁచిన ధేను వనఁగ.

అంత నా యింటియిల్లాలు చెంత కరిగి
బిందె చేకొని పొదిక్రిందఁ బెట్టి నిలువ,
ఉఱ్ఱుదాయియు లేకయె ముఱ్ఱుఁబాలు
కురిసె సంతతధారగా పొరలి పాఱ.

49