పుట:మధుర గీతికలు.pdf/600

ఈ పుట ఆమోదించబడ్డది



కడుపుతీపుకొలందిని నుడివియుంటి,
నీ వెఱుంగని ధర్మంబు లెందుఁ గలవు ?
పోయి ర మ్మని యందువా పోయి వత్తు,
అట్లు గాకున్న, నీ కొక్క యడ్డు గలదే ?

అతిథి సత్కారమునకంటె నధికఫలము
కలుగ దంచు వచింతురు గాదె బుధులు :
కాన నీ కిదె నా మేను కాన్క యిత్తు,
కాంక్ష దీఱ భుజింపుము కడుపునిండ.

కఱకుఱా లైన జాలిచే కఱఁగఁ జాలు
ఆవు పలికిన పలుకుల నాలకించి,
ఇట్లు వచియించె బెబ్బులి యెట్టకేని
హృదయమున ప్రేమలతికలు ఱేకులెత్త

'ఏను నిను వీడ, చయ్యన నింటి కేగి
పుత్రమోహంబు కడుపార పొంగిపొరల
మగుడ వత్తువొ రావొ నమ్మంగఁ జాల,
శపథ మేమి యొనర్తువో చెపుమ గోవ!'

45