పుట:మధుర గీతికలు.pdf/597

ఈ పుట ఆమోదించబడ్డది


పుడమి గోవులమై మేము పుట్టినపుడె
వ్యాఘ్రముల కామిషంబుగ నజుఁడు మమ్ము
చేసెఁ గావున, దీనికై చింత యేల ?
భోజ్యమను నేను, వ్యాఘ్రమా ! భోక్త వీవు.

అనుచు నీరీతి వచియించు నావుఁ జూచి,
వికటముగ నవ్వి మువ్వన్నె మెకము పలికె
'ఏటి కీ మాట లాడెద? విట్టి పలుకు
లెవ్వ రైనను విన్నచో నవ్వ రొక్కొ ?

ఒరులచేఁ జిక్కి మడియంగ నున్న వేళ,
ఏ యుపాయంబు పన్నియో యెట్టు లైన
తనదు ప్రాణంబు గాపాడఁ బెనఁగుఁ గాని,
సమ్మతించునె చావ నే జంతు వేని?

నోటఁ జిక్కిన మృగము నేనాఁట సైన
విడిచె పులి యంచు వింటివే వెఱ్ఱిగోవ?
కోరి తనుదాన బెబ్బులి నోరఁ గవియు
జంతు వెందైన నుండునే జగతి యందు?

42