పుట:మధుర గీతికలు.pdf/596

ఈ పుట ఆమోదించబడ్డది


వీఁకమై నేను తన మేను నాఁకుచుండ,
తోఁక పై కెత్తి, వీనుల దోరవైచి,
కన్ను లఱమోడ్చి సొక్కు నా చిన్నికూన
కెవరు ది క్కొకొ యక్కటా యింకమిఁద?

నన్ను గానక నెమకి నా కన్నకొడుకు
దారి నే గొడ్డుటా వైనఁ దారసిలిన,
పొదుఁగు తొడుకఁగ నయ్యది యుదరిపడుచు
కొమ్ముచేఁ గ్రుమ్మి చిమ్మునో కుదికిలఁబడ

కుక్షి నిండును గ్రుక్కెడు గుమ్మపాల
నాదు సుతునకు, నా మేనినంజు డెల్ల
తనివి దీఱఁగ నారగించినను గాని
ఉడుగ దించుకయేని నీ కడుపుచిచ్చు.

చిన్ని పాపకు మున్నుగా చన్ను గుడిపి,
అవల నీ యాఁకలిని దీర్తు వ్యాఘ్రరాజ!
ఇంతమాత్రము చనవు నా కియ్య వయ్య!
పుట్టకుండునె దయ నీకు పులివ యైన ?

41