పుట:మధుర గీతికలు.pdf/593

ఈ పుట ఆమోదించబడ్డది



ఒక్క దినమున నా ధేను వూరిబయట
కానలో మేయుచుండఁగ, కాంచి పొంచి
చెంగు మని యొక్క గంతున చెంగలించి,
గోవుపైఁ బడె నా పులి గోండ్రు మందు.

గుప్పు మని యిట్లు తనపై కి కొప్పరించి
బొబ్బరింతలు వెట్టు బెబ్బులిని జూచి,
కొంచెమేనియు నయ్యావు కుదిలగొనక
ఇట్టు లనియెను ధీరత యుట్టిపడఁగ.

‘ఆగు మాగుము పులిఱేఁడ యాత్ర మేల!
చిడుముడి యొకింత మాని, నేఁ జెప్పబోవు
చిన్న విన్నప మొకసారి చిత్తగించి,
ఆరగింపుము కడుపార నవల నన్ను,'

అనుడు, నా మాట బెబ్బులి యాలకించి,
వెఱఁగుపాటును నివ్వెఱ పెనఁగొనంగ,
మీఁది కెత్తిన కే ల ట్టె మీఁద నిలిపె,
చిత్తరువులోని బొమ్మ నా చేష్ట లుడిగి.

38