పుట:మధుర గీతికలు.pdf/588

ఈ పుట ఆమోదించబడ్డది


లోకనిందను సైరింప లేక విభుఁడు
వనములకు నన్ను పనిచిన పనుచుఁ గాక !
నాఁడె యా మాట నాతోడ నాడరాదె?
అకట ! ఈరీతి కపటనాటక మి దేల?

అంకమునఁ జేర్చి బాళి న న్నదిమికొనుట
అకట ! అనురాగమున కది యవధియేమొ?
మోము మోమున గదియించి ముద్దు లిడుట
చెలిమి కయ్యది కడసారి చీటి యేమొ?

పూర్ణచంద్రుని బోలు నెమ్మోమువాని
చంద్రికల నీను మందహాసంబువాని
కలువఱేకుల నేలు కన్గవలవాని
రాము విడనాడి నే నింక బ్రదుకఁగలనె ?

'మున్ను లంకాపురంబున నన్నినాళ్ళు
ఉవిద నను బాసి జీవించియుండ లేదె?
అట్లె నేఁడును బ్రదుకదే యడవులందు ?'
అంచు నాథుఁడు మదిని భావించె నేమొ?

33