పుట:మధుర గీతికలు.pdf/585

ఈ పుట ఆమోదించబడ్డది


సీత
      అడల నేటికి లక్ష్మణా ! అన్నయాన
      దాఁటవచ్చునె నీకు? విధాత నన్ను
      అడవులం బడి యిడుమల బడలు మంచు
      వ్రాసియుండఁగ, తప్పింప వశమె తండ్రి?

      ఎన్న డే దంపతులు భాగ్యహీను లగుచు
      నొండొరుల బాసి వెత నొందుచుండఁ జూచి
      నవ్వియుంటినొ పూర్వజన్మంబునందు,
      అనుభవింపక తీఱునె యా ఫలంబు ?

      ఎల్ల రును నన్ను సాధ్వీమతల్లి యనుచు
      ఎంతొ వినుతింప విని సంతసింతు గాని,
      కల్ల నిందలఁ బాల్పడి కానలందు
      ఇట్లు కడగండ్ల బడుదు నం చెఱుఁగ నైతి?

      పిడుగు కంటెను కటకటా ! బెడిద మైన
      పలుకు వినియును గుండియ పగుల దయ్యె.
      పాడుబొందిని ప్రాణంబు బాయ దయ్యె ;
      ఎట్లు వేగింతునో కాల మింకమీద ?

30