పుట:మధుర గీతికలు.pdf/575

ఈ పుట ఆమోదించబడ్డది


అఖిలలోకంబు లెవని సాయంబు లేక
నిముసమేనియు నించుక నిలువలేవొ,
అట్టి రామున కేను సాయంబుపడుట
భానునకు దివ్వె చూపించుభాతి కాదె?

'ఏకతంబున సతి వీడి యే కతమున
నీవు నా యాన జవదాఁటినా' వటంచు
అలుకమై చూచి నా యన్న యడుగ, నప్పు
డేమి వచియింతు నమ్మరో! యీవె చెపుమ.

చండతర మైన యాతని శాసనంబు
నిఖిలజగములు తలదాల్బి నిలిచియుండు,
వాని యానతి జవదాఁట భావ్య మగునె?
భ్రాతృ సేవాపరాయణ వ్రతుఁడ నేనె.

నిన్ను గాపాడు మని యన్న నిలిపె నన్ను,
అన్నఁగాపాడఁ బొ మ్మని యనిపె దీవు;
ఏది కర్తవ్యమో నిర్ణయింపఁ జాల,
ముందు జన నూయి, వెనుకకు బోవ గోయి.

20