పుట:మధుర గీతికలు.pdf/573

ఈ పుట ఆమోదించబడ్డది

లక్ష్మణుఁడు.


హరిహరీ ! తల్లి ! ఎంత మాటాడినావు!
శాంత మగు నీదు హృదయకోశముననుండి
ఇట్టి నిష్ఠురవచనంబు లెట్లు వెడలె!
మంచుముద్దను పుట్టునే మండుచిచ్ఛు?

కొఱవితోఁ గాల్చినట్టులు, సురియ వెట్టి
వ్రచ్చినట్టులు, కొఱ్ఱున గ్రుచ్చినట్లు,
కఱకుఱంపాన కోసినకరణి, నీదు
కఠినవాక్కుల నా మది కలఁగఁబాఱె

ఎన్నఁడైనను నీవు పల్లె త్తుమాట
నాడి యెఱుఁగుదె? అక్కటా! నేఁడు నన్ను
పిడుగులను బోలు బెడిదంపు నుడులచేత
నిట్లు నొప్పింప నీ మన సెట్టు లొప్పె?

పావనం ఐదు నీ పాదపద్మములనె
కాని, కన్నెత్తి నీ మోము కాంచి యెఱుఁగ,
అట్టి భవదీయదాసుని, అనుఁగుసుతుని
చంపుమాటలు నన్ను వేచంగ నగునె?

18